Wednesday, 15 January 2014

ప్రధమ అధ్యాయం

11.

అయనేషు చ సర్వేషు యథా భాగ మవస్థితాః |
భీష్మ మేవాభి రక్షంతు భవంతః సర్వ ఏవ హి || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 11 ) 

భావము :
(దుర్యోధనుడు ద్రోణాచార్యునితో తన సైన్యము గురించి చెప్తూ ఉన్న సందర్భం...) 
"సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి, మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును ఇవ్వవలసి ఉన్నది."  
----------------------------------------

12.

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 12 ) 

భావము :
(దుర్యోధనుని సూచనల తరువాత జరిగిన విశేషం...)  
"అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడైన భీష్ముడు, దుర్యోధనునికి ఆనందము కలిగేట్లుగా, సింహగర్జన వంటి శబ్దాన్ని వినిపిస్తూ తన శంఖమును బిగ్గరగా పూరించెను." 
----------------------------------------

13.

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసైవాభ్య హన్యంత స శబ్దస్తుములోభవత్ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 13 ) 

భావము :
"అటు పిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి అన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా ఉండెను." 
----------------------------------------

14.

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |  
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 14 )  

భావము :
"ఎదుటి పక్షమున ఉన్న శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు పూంచబడిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యమైన శంఖములను పూరించారు."   
----------------------------------------

15.

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 15 )   

భావము :
"శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమను తన శంఖమును పూరించెను; 
భోజన ప్రియుడును, ఘనకార్యములను చేయునటువంటి భీముడు పౌండ్రం అనే తన మహాశంఖమునూదెను."
----------------------------------------

16.

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః | 
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 16 )    

భావము :
"కుంతీ పుత్రుడైన యుధిష్ఠిర మహారాజు 'అనంత విజయం ' అనే పేరుగల శంఖాన్ని పూరించాడు. 
నియమ స్వరూపుడైన నకులుడు 'సుఘోషం ' అనే శంఖాన్ని, సత్సంగ రూపుడైన సహదేవుడు 'మణిపుష్పకం ' అనే  శంఖాన్ని పూరించారు." 
----------------------------------------

17.

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||   

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 17 )    

భావము :
"గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి తమ తమ శంఖములను పూరించారు."  
----------------------------------------

18.

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 18 )    

భావము :
"అచల పదదాయకుడు ద్రుపదుడు, ధ్యాన రూపిణి అయిన ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు, గొప్ప బాహువులు కలిగిన 
సుభద్రా తనయుడు మొదలైన వారందరును తమ తమ శంఖములను పూరించారు." 
----------------------------------------

19.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 19 )    

భావము :
"ఆ వివిధ శంఖముల ధ్వని అత్యంత భీకరమయ్యెను. భూమి, ఆకాశం రెండిటిని కంపించేలా.. అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను."  
----------------------------------------

20.

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాణ్డవః |     
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 20 )    

భావము :
"ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము(హనుమానుని రూపము కూర్చిఉన్న ధ్వజము) కూర్చబడిన రథమునందు నిలిచి, 
ధనస్సును చేతబట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా ! వ్యూహముగా నిలిచి ఉన్న ధృతరాష్ట్ర తనయులను చూచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను."
----------------------------------------

21 - 22.

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత |
యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ ||
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 21 - 22 )    

భావము : 
(అర్జునుడు పలికెను...) "ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము. తద్ద్వారా యుద్ధము 
చేయగోరి ఇచ్చట ఉపస్థితులైనవారిని మరియు ఈ మహా సంగ్రామమున నేను తలపడవలసినవారిని చూడగలుగుతాను."  
----------------------------------------

23.

యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః | 
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 23 )    

భావము : 
"దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి (దుర్యోధనునికి) ప్రియమును కలిగించుటకై యుద్ధము చేయుటకు ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను." 
----------------------------------------

24.

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||    

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 24 )    

భావము :  
(సంజయుడు పలికెను...) "ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను." 
----------------------------------------

25.

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 25 )    

భావము :  
"భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షములో శ్రీకృష్ణుడు, "ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము.." అని పలికెను."     
----------------------------------------

26.

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ | 
ఆచార్యాన్మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా |
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 26 )    

భావము :   
"ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, 
మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను చూచెను." 
----------------------------------------

27.

తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బన్ధూనవస్థితాన్ |   
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 27 )    

భావము :   
"నానావిధ బంధువులను, స్నేహితులను చూచిన వెంటనే కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడై ఈ విధముగా పలికెను." 
----------------------------------------

28.

అర్జున ఉవాచ 
దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితమ్ | 
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 28 )    

భావము :  
అర్జునుడు పలికెను : "ఓ కృష్ణా! యుద్ధోత్సాహమున నా యెదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను చూచి నా శరీర అవయవములు కంపించుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది."  
----------------------------------------

29.

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే |
గాణ్డీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిహద్యతే || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 29 ) 

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)    
భావము :  "నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది. గాండీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతూ ఉన్నది, నా చర్మము మండిపోవుచున్నది." 
----------------------------------------

30.

న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః | 
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 30 )  

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)    
భావము : "నేను ఇప్పుడు ఏ మాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరచిపోతున్నాను. నా మనస్సు చలిస్తోంది. ఓ కృష్ణా! కేశి సంహారీ! కేవలము విపరీతములనే నేను చూచుచున్నాను."   
----------------------------------------

31.

న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే | 
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 31 ) 

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)    
భావము : "ఓ కృష్ణా! ఈ యుద్ధమునందు నా స్వజనమును(సొంతవారిని) చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. 
ఆ తరువాత వచ్చు విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరుకొనలేకపొతున్నాను."   
----------------------------------------

32.

కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా | 
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 32 ) 

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)    
భావము : "ఓ గోవిందా! మేమెవరి కోసమని రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నామో, 
వారందరును ఈ యుద్ధరంగమున నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలిగే ప్రయోజనమేమి?"    
----------------------------------------

33, 34.

త ఇమేవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ | 
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః || 

మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా | 

ఏతాన్న హన్తుమిఛ్చామి ఘ్నతోపి మధుసూదన ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 33, 34 )  

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)    
భావము :  "ఓ మధుసూదనా! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, 
ఇతర బంధువులందరును తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపదలచాలి."    
----------------------------------------

35.

అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే |
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 35 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)    
భావము :  "ఓ జనార్దనా! ఈ ధరిత్రి విషయమటు ఉంచి ముల్లోకాలను పొందినప్పటికినీ, నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము?" 
----------------------------------------

36.

పాపమే వాశ్రయే దస్మాన్ హత్వై తానాతతాయినః || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 36 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..) 
భావము : "తుఛ్చమైన లాభాం కోసమై అవినీతిని ఆశ్రయించేవారిని ఆతతాయి అంటారు. 
రాజ్యము కొరకు మోహితులై ఉన్న దుర్యోధనుడు, మొదలైన వారిని చంపితే మాకు పాపమే చుట్టుకుంటుంది." 
----------------------------------------
37.
తస్మాన్నారాహ వయం హంతుం ధార్తా రాష్ట్రాం స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్స్యాం మాధవ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 37 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)  
భావము : "హే కృష్ణా! ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సమ్హరించుట మాకు ఉచితము కాదు. 
స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము."   
----------------------------------------

38.

యధ్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః |
కులక్షయ కృతం దోషం  మిత్ర ద్రోహేచ పాతకం || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 38 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)  
భావము : "లోభం చేత భ్రష్ట చిత్తులైన వీరు కుల నాశమనే దోశాన్నీ, మిత్ర ద్రోహమనే పాపాన్నీ, చూడలేకపోతున్నారు. అది వారి లోపం." 
----------------------------------------

39.

కథం న ఙ్ఞేయ మస్మా భిః పాపాదస్మాన్నివర్తితుం |
కుల క్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్ధన || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 39 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)  
భావము : "హే జనార్ధనా! వీరు అర్థం చేసుకొనలేకపోయినా, కులనాశము ఎంతటి దోషమో తెలిసిన మేము కూడా ఇటువంటి పాపకార్యాన్ని ఎందుకు ఆచరించాలి?" 
----------------------------------------

40.

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్న మధర్మోభిభవత్యుత || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 40 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)  
భావము : "కుల నాశనం అవటం వలన సనాతనమైన కులధర్మం నశించిపోతుంది. ఆ విధంగా మిగిలిన వారందరూ అధర్మవర్తనులే అవుతారు." 
---------------------------------------- 

41.

అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయః | 
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 41 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)   
భావము : "ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలుట వలన కులస్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అటువంటి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును."    
----------------------------------------

42. 

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 42 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)   
భావము : "అవాంఛిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ 
ఆచారమును నష్టపరిచినవారు ఇరువురికినీ నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడటము 
వలన అటువంటి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుతారు."   
----------------------------------------

43.

దోషైరేతైః కులఘ్నానాం వర్ణ సంకర కారకైః |
ఉత్సాద్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః ||    

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 43 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)   
భావము : "వంశాచారమును నశింపచేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును."
----------------------------------------

44.

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్ధన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 44 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)   
భావము : "ఓ కృష్ణా! జనార్ధనా! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను విని ఉన్నాను." 
----------------------------------------

45.

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం |
యద్ రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||  

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 45 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)   
భావము : "అహో! ఘోరమైన పాపములను చేయుటానికై మేము సిద్ధపడటము ఎంత విచిత్రము! రాజ్య సుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనాన్నే చంపాలనుకుంటున్నాము."    
----------------------------------------

46.

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 46 )   

(అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న వాక్యాలు..)   
భావము : "నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడినైన నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగము నందు వధించినా అది నాకు క్షేమకరమే అవుతుంది."  
----------------------------------------

47.

సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ | 
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః || 

(భగవద్గీత అధ్యాయము - 1, శ్లోకము - 47 )  

సంజయుడు పలికెను : 
"రణరంగము నందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పడవేసి దఃఖముచేత కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను."
----------------------------------------